కాకినాడ జిల్లా బాణసంచా పేలుడుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  • కాకినాడ ఘటన దురదృష్టకరమన్న ప్రధాని మోదీ
  • బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి
  • గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సాయం ప్రకటన
  • బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు.

ఈ మేరకు ప్రధాని మోదీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "కాకినాడ జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని కూడా ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. 


More Telugu News