IPL 2026: ఈసారి కాస్త ఆలస్యంగా ఐపీఎల్... కారణమిదే!

IPL 2026 Likely Delayed Start Due to Elections
  • రెండు రోజులు ఆలస్యంగా ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశం
  • మార్చి 28న ప్రారంభమై మే 31న ముగియనున్న ఐపీఎల్
  • మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీ కోసం వేచి చూస్తున్న యాజమాన్యం
ఈ సంవత్సరం ఐపీఎల్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2026 ప్రారంభమవుతుందని తొలుత ప్రకటించినప్పటికీ వివిధ కారణాల వల్ల రెండు రోజుల తర్వాత ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 28న ప్రారంభమై మే 31న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. వచ్చే వారంలో దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కావడానికి ముందు ఫ్రాంచైజీలకు, ఆటగాళ్ళకు కొంత సమయం ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి షెడ్యూల్, వేదికలకు సంబంధించి వచ్చే వారం వెల్లడించవచ్చని తెలుస్తోంది.

అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి తేదీలపై స్పష్టత రానందున బీసీసీఐ వేచి చూస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి ఉన్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు గౌహతి రెండో హోంగ్రౌండ్. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీలకు అనుగుణంగా మ్యాచ్ తేదీలను ఖరారు చేయడానికి వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే షెడ్యూల్ రెండు దశల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
IPL 2026
Indian Premier League
BCCI
IPL Schedule
Chennai Super Kings
Kolkata Knight Riders

More Telugu News