Nara Lokesh: 25 ఏళ్లకే పెళ్లి చేయాలి... దేవాన్ష్‌ను ఇప్పటినుంచే ట్యూన్ చేస్తున్నా: నేతలతో నారా లోకేశ్ ఫన్నీ కామెంట్స్

Nara Lokesh Funny Comments on Devansh Marriage at 25
  • కర్నూలు, నరసరావుపేట కూటమి నేతలకు మంత్రి లోకేశ్ విందు
  • కుటుంబ సభ్యులతో సహా హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు
  • రాజకీయాలకు దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో భేటీ
  • నియోజకవర్గ సమస్యల పురోగతిపై నేతలకు నివేదికల అందజేత
  • మహిళలకు మంగళగిరి పట్టుచీరలు బహూకరించిన లోకేశ్
రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల మధ్య ఉండే బంధం వారి కుటుంబాల మధ్య కూడా అనుబంధంగా మారాలనే ఉద్దేశంతో ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబసభ్యులకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సమావేశం పూర్తిస్థాయి రాజకీయాలకు దూరంగా, ఒక ఫ్యామిలీ గెట్-టుగెదర్‌ను తలపించింది. రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా, పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విందు సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నేతల కుటుంబసభ్యులు ఒకరికొకరు పరిచయం చేసుకుని, సరదాగా ముచ్చటించారు. మంత్రి లోకేశ్ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి, వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. "పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ సెటిల్ అయ్యారు?" అంటూ ఆప్యాయంగా వాకబు చేశారు. ఈ క్రమంలో ఆయన సరదాగా మాట్లాడుతూ.. అబ్బాయిలకు 25 ఏళ్లకే పెళ్లి చేయాలని, తనకు 24 ఏళ్లకే వివాహమైందని గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్‌కు కూడా 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నానంటూ నవ్వులు పూయించారు.

ఈ ఆత్మీయ కలయికలోనూ లోకేశ్ తనదైన మార్క్ చూపించారు. నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం ఆయా నేతలు గతంలో తనకు ఇచ్చిన వినతిపత్రాలపై తీసుకున్న చర్యల పురోగతిని వివరిస్తూ ప్రత్యేక నివేదికలను వారికి అందజేశారు. ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఏవి పరిశీలనలో ఉన్నాయి, ఇంకా ఏవి మొదలుకాలేదు అనే వివరాలను స్పష్టంగా తెలియజేశారు. విందుకు హాజరైన మహిళామణులను గౌరవిస్తూ వారికి మంగళగిరి పట్టుచీరలను ఆత్మీయంగా బహూకరించారు. విందు ముగిసిన అనంతరం, ఇంటి గేటు వరకు స్వయంగా వచ్చి ప్రతి ఒక్కరికీ ఆత్మీయంగా వీడ్కోలు పలికి వారిని సాగనంపారు.

ఈ సమ్మేళనానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు పీవీ పార్థసారధి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు హాజరయ్యారు. అలాగే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Nara Lokesh
Devansh
Andhra Pradesh Politics
TDP
Family Get-Together
Kurnool
Narasaraopet
Mangalagiri Sarees
AP Assembly
Political News

More Telugu News