బ్రిటన్ ఎంపీని అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ సాయం కోరనున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మేనకోడలు, బ్రిటన్‌ ఎంపీ టులిప్ రిజ్వానా సిద్దిఖ్‌ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ ‘రెడ్ నోటీసు’ జారీ చేయాలని ఢాకా కోర్టు అధికారులను ఆదేశించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి సబ్బీర్ ఫైజ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధానిగా తన అత్త షేక్ హసీనా పలుకుబడిని ఉపయోగించుకుని, ఢాకాలోని గుల్షన్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌ను ఎలాంటి చెల్లింపులు చేయకుండా అక్రమంగా సొంతం చేసుకున్నారని టులిప్‌పై ఏసీసీ ఆరోపించింది. ఆమె ప్రస్తుతం విదేశాల్లో (యూకే) ఉన్నందున, అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ సహాయం అవసరమని కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు రెడ్ నోటీసుకు ఆదేశాలు ఇచ్చింది.

బంగ్లాదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీఎన్‌పీ ప్రభుత్వం, అవామీ లీగ్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలకు ఈ పరిణామం బలం చేకూరుస్తోంది. ఇటీవలే పూర్బాచల్ ప్లాట్ల కుంభకోణం కేసులో హసీనాకు పదేళ్లు, టులిప్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.
అయితే, తమపై వస్తున్న అవినీతి ఆరోపణలను హసీనా, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన, నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. ఎన్నిక కాని ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ఏసీసీ, పక్షపాత సాక్ష్యాలతో తమపై కేసులు బనాయించిందని, కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని వారు విమర్శించారు.

Tulip Siddiq
Bangladesh
Interpol
Sheikh Hasina
UK MP
Arrest warrant
Corruption allegations
Awami League
BNP
Dhaka

More Telugu News