ఇక ఇజ్రాయెల్ లోనూ మన యూపీఐ సేవలు

UPI Services Launched in Israel Says Narendra Modi
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) తన సేవలను మరో దేశానికి విస్తరించింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య డిజిటల్, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ యూపీఐ వినియోగంపై నేడు కీలక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ ఒప్పందంలో భాగంగా, ఇజ్రాయెల్ దేశీయ చెల్లింపుల వ్యవస్థతో యూపీఐని అనుసంధానిస్తారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పరిణామంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. "ఇజ్రాయెల్‌లో యూపీఐ వినియోగానికి ఒప్పందం కుదరడం ఆనందంగా ఉంది" అని ఆయన తెలిపారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల్లోని వ్యాపారాలకు లావాదేవీల ఖర్చులు, సమయం తగ్గుతాయని భావిస్తున్నారు.

యూపీఐ ఒప్పందంతో పాటు పలు కీలక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. "కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో సహకారం కోసం 'క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్ట్‌నర్‌షిప్' ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అణుశక్తి, అంతరిక్ష రంగాల్లోనూ కలిసి పనిచేస్తాం" అని మోదీ వివరించారు.

భారత్‌లో యూపీఐ వ్యవస్థ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధ్యయనం ప్రకారం, దేశంలోని మొత్తం లావాదేవీల్లో 57 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా 18-25 ఏళ్ల యువతలో 66 శాతం మంది యూపీఐని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక సహా 8కి పైగా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇజ్రాయెల్ కూడా చేరింది.
Go Back to Shorts
Narendra Modi
UPI Israel
UPI Payments
Digital Payments India
India Israel Relations
Digital Economy
Financial Technology
UPI Expansion
India Israel Trade
RuPay

More Telugu News