ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు
- బీహార్ కేడర్ ఐపీఎస్ సునీల్ నాయక్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన గుంటూరు కోర్టు
- సునీల్ నాయక్ కోసం పాట్నాలోనే మకాం వేసిన ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు సంబంధించి గుంటూరు న్యాయస్థానం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా విచారణకు గైర్హాజరవుతున్న సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం బీహార్‌లో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న నాయక్‌ను తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే పాట్నాలో పాగా వేశారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామను అరెస్ట్ చేసిన సమయంలో, కస్టడీలో ఆయనపై అమానుషంగా భౌతిక దాడి జరిగిందన్న ఆరోపణలపై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసులు నిన్న కోర్టులో వారెంట్ పిటిషన్ దాఖలు చేయగా, నిందితుడి సహాయ నిరాకరణను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తక్షణమే అరెస్ట్ వారెంట్‌కు పచ్చజెండా ఊపింది.
అయితే, బీహార్‌లో సునీల్ నాయక్‌పై అరెస్ట్ ప్రక్రియ ఉత్కంఠకు దారితీస్తోంది. ఇప్పటికే ఏపీ పోలీసు బృందం పాట్నాలో ఆయనను అదుపులోకి తీసుకుని, ఏపీకి తీసుకొచ్చేందుకు అక్కడి కోర్టులో ట్రాన్సిట్ పిటిషన్ వేయగా... ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అంతేకాదు, నెల రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నట్టు సమాచారం.
తాజాగా గుంటూరు కోర్టు సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో, ఏపీ పోలీసులు మరింత పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఆ ఐపీఎస్ అధికారిని పట్టుకునేందుకు బీహార్ పోలీస్ యంత్రాంగం సహకారం కోరుతూ, వీలైనంత త్వరగా ఆయనను గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.