ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు: పాఠ్యపుస్తకం నుంచి ఆ వివాదాస్పద చాప్టర్ తొలగింపు!

దేశంలో పాఠ్యపుస్తకాలను రూపొందించే జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కీలక నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండటంతో ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పొరపాటుపై బహిరంగంగా క్షమాపణలు కూడా కోరింది.

8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని నాలుగో అధ్యాయంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఓ పాఠ్యాంశం ఉంది. న్యాయమూర్తుల కొరత, కేసుల విచారణలో జాప్యం, మౌలిక సదుపాయాల లేమి వంటి అంశాలను ఇందులో వివరించారు. అయితే, ఈ విశ్లేషణలో భాగంగా 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే ప్రస్తావన ఉండటం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

విమర్శల నేపథ్యంలో తక్షణమే స్పందించిన ఎన్‌సీఈఆర్‌టీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని స్పష్టం చేసింది. కొన్ని వాక్యాలు తప్పుగా అర్థం వచ్చేలా ఉన్నాయని, పొరపాటు జరిగినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. వెంటనే మార్కెట్ నుంచి ఆ పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. త్వరలోనే సవరించిన పాఠ్యాంశాలతో కొత్త పుస్తకాలను ముద్రిస్తామని తెలిపింది. సవరించిన పాఠ్యపుస్తకాల డిజిటల్ కాపీలను త్వరలో తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఎన్‌సీఈఆర్‌టీ వెల్లడించింది. 

NCERT
NCERT Textbooks
Social Science Textbook
Indian Judiciary
Judicial System
Textbook Controversy
Class 8 Textbook
Education
India
Curriculum

More Telugu News