సునీల్ నాయక్‌ కోసం పాట్నాలోనే ఏపీ పోలీసుల మకాం

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం.సునీల్ కుమార్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయాలని కోరుతూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేంత వరకు పాట్నాలోనే ఉండాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది.

నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు రఘురామను సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సునీల్ నాయక్ ఏ-7గా ఉన్నారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు సోమవారం పాట్నా వెళ్లిన ఏపీ పోలీసులకు చుక్కెదురైంది. స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించడంతో బిహార్ పోలీసులు సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసుల అదుపు నుంచి విడిపించుకుని తీసుకెళ్లారు.

ఈ పరిణామాల నేపథ్యంలో విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం పాట్నాలోనే మకాం వేసింది. వారికి మద్దతుగా మరికొందరు సిబ్బంది, న్యాయనిపుణులను ఉన్నతాధికారులు పాట్నాకు పంపించారు. 

మరోవైపు, సునీల్ నాయక్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ గుంటూరు మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. విచారణకు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదని, దర్యాప్తు ముందుకు సాగాలంటే ఆయన విచారణ అత్యంత కీలకమని ప్రాసిక్యూషన్ వాదించింది. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ పిటిషన్‌పై బుధవారం తగిన ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు. కోర్టు ఆదేశాలు వెలువడగానే సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

Sunil Nayak
Raghurama Krishnam Raju
AP CID
Bihar Police
Custodial Torture Case
Non-Bailable Warrant
Guntur Court
Andhra Pradesh Police
Patna
Vijayanagaram SP Damodar

More Telugu News