గుంటూరులో ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ: ఏపీ, తెలంగాణ యువతకు అవకాశం

  • గుంటూరు ఏఎన్‌యూలో మార్చి 9 నుంచి ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ
  • ఏపీ, తెలంగాణకు చెందిన మహిళా, పురుష అభ్యర్థులకు అవకాశం
  • మహిళలకు మార్చి 9, 10 తేదీల్లో, పురుషులకు వేర్వేరు తేదీల్లో ఎంపికలు
  • ఇంటర్ పాసైన అవివాహిత యువతకు వాయుసేనలో చేరే ఛాన్స్
  • ముందస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని వెల్లడి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ఫోర్స్) శుభవార్త చెప్పింది. అగ్నివీర్ వాయు నియామకాల కోసం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో మార్చి 9 నుంచి ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై నిన్న కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూటింగ్ డైరెక్టర్, వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ర్యాలీ షెడ్యూల్‌ను వివరించారు. ‘మార్చి 9, 10 తేదీల్లో రెండు రాష్ట్రాల మహిళా అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీల్లో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు ముందస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అభ్యర్థులు నేరుగా పాల్గొనవచ్చని తెలిపారు. 

ఈ నియామకాలకు అవివాహిత యువతీయువకులు మాత్రమే అర్హులు. జులై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ. ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట శారీరక దారుఢ్య పరీక్షలు, ఆ తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారు తదుపరి దశలకు అర్హత సాధిస్తారు. 

ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు అన్ని పత్రాల ఆరు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది. షెడ్యూల్ చేసిన తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.
 


More Telugu News