తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ

Dev Ji Surrenders to Telangana DGP
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో నక్సల్ ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు అగ్రశ్రేణి నాయకులతో సహా మొత్తం నలుగురు కీలక నేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తాత్కాలిక కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (దామోదర్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి (గంగన్న) హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఈ లొంగుబాటుతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్మూలించబడినట్లేనని పోలీసులు ప్రకటించారు.

లొంగిపోయిన నేతలు దశాబ్దాలుగా అజ్ఞాతంలో కొనసాగుతూ పార్టీలో అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్న దేవ్ జీ, 46 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్న మల్లా రాజిరెడ్డి వంటి సీనియర్లు జనజీవన స్రవంతిలోకి రావడం ఉద్యమాన్ని తీవ్రంగా బలహీనపరిచిందని డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకంలో భాగంగా దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున రివార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా 11 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు (గణపతి) అడవుల్లో లేరని, బయట ఎక్కడో ఆశ్రయం పొందుతున్నారని డీజీపీ పేర్కొన్నారు.

రాజకీయ జీవితం కొనసాగిస్తా: దేవ్ జీ

ఈ సందర్భంగా మావోయిస్టు నేత దేవ్ జీ మాట్లాడుతూ, అనారోగ్య కారణాల రీత్యా తాను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఇది కేవలం వ్యక్తిగత జీవితం కోసం కాదని, ప్రజల సమస్యలపై చట్టబద్ధమైన పద్ధతుల్లో (లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో) పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. "దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం గైడెన్స్‌గా ఇకపై రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. తొందరపడి మాట్లాడితే అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుందని, తన భవిష్యత్ రాజకీయ జీవితానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అన్ని విషయాలు పంచుకోలేకపోతున్నానని వివరించారు. త్వరలోనే ఇంటర్వ్యూల రూపంలో అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానమిస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిణామం తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Go Back to Shorts
Dev Ji
Telangana
Maoist
CPI Maoist
Surrender
Naxal
Shivdhar Reddy
Malla Raji Reddy
Bade Chokkrao
Nune Narasimha Reddy

More Telugu News