ఆ మ్యాచ్ కూడా స్టేడియంకు వెళ్లి చూస్తా: జగన్‌కు నారా లోకేశ్ కౌంటర్

  • భారత్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళితే ఆ మ్యాచ్ తప్పక చూస్తానన్న లోకేశ్
  • అవసరమైతే జగన్‌కు కూడా టికెట్ కొనిస్తానని సెటైర్
  • వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్‌కు రూ.1000 కోట్ల లబ్ధి అని ఆరోపణ
  • హెరిటేజ్‌కు ప్రభుత్వ లబ్ధి చేకూరలేదని స్పష్టీకరణ
  • బడ్జెట్‌పై చర్చ కోరేవాళ్లు సభను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్న
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ చూసేందుకు తాను తప్పనిసరిగా వెళ్తానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అవసరమైతే పులివెందుల ఎమ్మెల్యే (జగన్)కి కూడా తన డబ్బులతో టికెట్ కొనిస్తానని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో తాను శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్ వీక్షించడంపై జగన్ చేసిన విమర్శలకు లోకేశ్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వెళ్లాలా అని జగన్ అంటున్నారు. టీమిండియా ఫైనల్‌కు వెళితే కచ్చితంగా వెళ్తాను. ఆయనకూ (జగన్‌కు) ఓ టికెట్ తీసుకుంటా" అని లోకేశ్ అన్నారు. తాను గతంలో సొంత డబ్బులతోనే మ్యాచ్ చూశానని మరోసారి స్పష్టం చేశారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌కు చెందిన సాక్షి మీడియా, భారతి సిమెంట్స్ సంస్థలకు రూ.1000 కోట్ల మేర అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారని లోకేశ్ ఆరోపించారు. అయితే, తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌కు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కలగలేదని తేల్చిచెప్పారు. హెరిటేజ్ నెయ్యిపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. కిలో నెయ్యి మార్కెట్‌లో రూ.1,000కి పైగా ఉంటే, రూ.360కి ఎక్కడైనా దొరికితే అది కల్తీదేనని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే హెరిటేజ్‌పై సెబీకి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.

బడ్జెట్‌పై చర్చ జరగాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని లోకేశ్ విమర్శించారు. నిజంగా చర్చపై చిత్తశుద్ధి ఉంటే, నాలుగు రోజుల పాటు సభా కార్యక్రమాలను ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు.


More Telugu News