"ఢిల్లీలో భయ్యా ఖాళీ.. బెంగాల్‌లో దీదీ వంతు" మమతా బెనర్జీపై రేఖా గుప్తా సెటైర్
- మహిళా సీఎం అయినా బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదని విమర్శ
- బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్రం పంపిన నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్న
- కోల్ కతా బహిరంగ సభలో ఢిల్లీ సీఎం రేఖా గుప్త ప్రసంగం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో 'భయ్యా' (అరవింద్ కేజ్రీవాల్)ను ప్రజలు ఎలాగైతే సాగనంపారో, ఇప్పుడు బెంగాల్‌లో 'దీదీ' (మమతా బెనర్జీ) ని కూడా సాగనంపుతారని ఆమె వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ రేఖా గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు.
భయ్యా వర్సెస్ దీదీ.."ఢిల్లీలో భయ్యా ఉండేవారు, బెంగాల్‌లో దీదీ ఉన్నారు. భయ్యాను ఇప్పటికే పంపించేశారు, ఇప్పుడు ఎవరి వంతు? వారిద్దరూ ఒక్కటే.. ప్రజాధనంతో చేసే సంక్షేమ పథకాలపై తమ పేర్లు ఉండాలని కోరుకుంటారు" అని రేఖా గుప్తా ఎద్దేవా చేశారు. బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు పంపిస్తున్నా ఆ డబ్బు పేదలకు చేరడంలేదని, అసలు ఆ నిధులన్నీ ఎటు వెళ్తున్నాయని ప్రశ్నించారు.
మహిళా సీఎం అయినా..
రాష్ట్రానికి ఓ మహిళ ముఖ్యమంత్రిగా వున్నా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం, మహిళల గౌరవానికి విలువ లేకపోవడం శోచనీయమని రేఖా గుప్తా విమర్శించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో మరెక్కడా లేదని ఆరోపించారు. బెంగాల్ లో గూండాగిరి, అవినీతి రాజకీయాలకు అంతం దగ్గరపడిందని, ఈ ఎన్నికలు రాష్ట్రంలో మార్పు తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం చేసిన ఈ 'భయ్యా-దీదీ' వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.