లడ్డూ వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు: భూమన

తిరుపతి లడ్డూ వివాదంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, దారి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ విమర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలను, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అవకతవకలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.

ఆదివారం నాడు వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై ఏకసభ్య కమిటీని నియమించడం సుప్రీంకోర్టును అవమానించడమేనని అన్నారు. "లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు లేదని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ సిట్ బృందం స్పష్టంగా నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆ నివేదికను ప్రశ్నించేలా కమిటీ వేయడం సర్వోన్నత న్యాయస్థానం గౌరవాన్ని సవాలు చేయడమే" అని ఆయన పేర్కొన్నారు.

లడ్డూపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేసిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారని భూమన ఆరోపించారు. సిట్ నివేదికతో వారి వాదనలు తప్పని తేలడంతో, ముఖం చాటేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కమిటీ చట్టపరంగా నిలబడదని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఈ కుంభకోణానికి మూలమైన హెరిటేజ్, ఇందాపూర్, భోలే బాబా డెయిరీల మధ్య ఉన్న సంబంధాలను మేం బయటపెడుతూనే ఉంటాం" అని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు, పరకామణి చోరీ కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రాజకీయ ప్రత్యర్థులను ఇరికించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందని, ఇది కూడా ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు భయపడబోమని, న్యాయపోరాటం చేస్తామని భూమన తేల్చి చెప్పారు.

Bhumana Karunakar Reddy
TDP
YCP
Tirupati Laddu
TTD
Chandrababu Naidu
Diversion Politics
Supreme Court
Heritage Dairy
Andhra Pradesh Politics

More Telugu News