'ది కేరళ స్టోరీ 2'ని వ్యతిరేకిస్తూ 'బీఫ్'తో నిరసన

  • ఫిబ్రవరి 27న విడుదలవుతున్న 'ది కేరళ స్టోరీ 2'
  • లవ్ జిహాద్ చుట్టూ తిరిగే కథాంశం
  • సినిమాపై విమర్శలు గుప్పించిన పినరయి విజయన్
  • తిరువనంతపురంలో బీఫ్ ఫెస్టివల్

‘ది కేరళ స్టోరీ 2’ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కేరళలో వివాదం రాజేస్తోంది. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రం మతమార్పిడి, లవ్ జిహాద్ అంశాల చుట్టూ తిరుగుతుందని డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ చెప్పారు. మరోవైపు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేతలు ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.


సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ, స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ కేరళ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తిరువనంతపురంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. పరాటా, గొడ్డుమాంసం కూరను వడ్డిస్తూ నిరసన వ్యక్తం చేశారు.


మరోవైపు సీఎం పినరయి విజయన్ ఇటీవల స్పందిస్తూ... “ఈ సినిమా కేరళ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. రాష్ట్రాన్ని ఉగ్రవాద కేంద్రంగా చూపే ప్రయత్నం జరుగుతోంది. లౌకికవాదాన్ని, శాంతిని దెబ్బతీసేందుకు రూపొందించిన విద్వేషపూరిత ప్రచారం ఇది. కేరళలో ఇలాంటివి జరగవు. ప్రజలు సమష్టిగా ఈ సినిమాను తిరస్కరించాలి” అని అన్నారు.

కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ... “కేరళలో ప్రజలు గొడ్డు మాంసం తినాల్సి వస్తుందని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. మతపరంగా ప్రజల్ని విభజించే ప్రయత్నం ఇది” అని విమర్శించారు.



More Telugu News