పీఎస్ఎల్వీ వైఫల్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు.. కమిటీని నియమించిన కేంద్రం

  • ప్రధాని మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్ నేతృత్వంలో విచారణ
  • గత నెలలో విఫలమైన రాకెట్ ప్రయోగంపై దర్యాప్తు
  • వరుసగా రెండోసారి పీఎస్ఎల్వీ విఫలం కావడంతో ప్రభుత్వ చర్యలు
  • ఇప్పటికే షార్, వీఎస్‌ఎస్‌సీ కేంద్రాలను సందర్శించిన కమిటీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం కావడంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానికి గతంలో ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా పనిచేసిన కె. విజయరాఘవన్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ కో-ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 

ఈ ఏడాది జనవరి 12న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే, మూడో దశ సాలిడ్ మోటారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది. ఈ ఘటనలో డీఆర్‌డీఓకు చెందిన కీలకమైన 'అన్వేష' ఉపగ్రహంతో పాటు మొత్తం 16 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరలేదు. 

పీఎస్ఎల్వీ రాకెట్ వరుసగా రెండోసారి విఫలం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. గతంలో 2025 మే నెలలో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ61 కూడా దాదాపు ఇలాంటి కారణాలతోనే విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా వైఫల్యంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించింది. 

ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే శ్రీహరికోటలోని షార్ కేంద్రాన్ని, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను సందర్శించి విచారణ ప్రారంభించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలపై ఇస్రో నిర్ణయం తీసుకోనుంది.


More Telugu News