17వ అంతస్తు నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి

  • థాయ్‌లాండ్‌ పట్టాయాలోని అపార్ట్ మెంట్ నుంచి కిందపడి మృతి
  • అపార్ట్ మెంట్‌లో ఎలాంటి ఘర్షణ లేదా గందరగోళ వాతావరణం కనిపించలేదన్న పోలీసులు
  • కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేని పోలీసులు
  • అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడి
ఫ్యాషన్ దిగ్గజం ఏఎస్ఓఎస్ (ASOS) సహ వ్యవస్థాపకుడు క్వెంటిన్ గ్రిఫిత్స్ థాయ్‌లాండ్‌లో ఓ అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. పట్టాయాలోని అపార్ట్ మెంట్ నుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడి మృతి చెందారు. పోలీసులు, మెడికల్ సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు వచ్చి చూసేసరికి ఆయన నేలపై విగతజీవుడిలా కనిపించారు.

ఆయన మరణానికి ముందు అపార్ట్ మెంట్‌లో ఎలాంటి ఘర్షణ లేదా గందరగోళ వాతావరణం కనిపించలేదని అధికారులు వెల్లడించారు. అయితే కుట్ర కోణాన్ని వారు తోసిపుచ్చలేదు. పోస్టుమార్టం నివేదిక అనంతరం ఆయన మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. క్వెంటిన్ గ్రిఫిత్స్ అదే అపార్ట్ మెంట్‌లో ఉంటున్నారు.

2000 సంవత్సరంలో ప్రారంభమైన ఏఎస్ఓఎస్ సంస్థ వ్యవస్థాపకుల్లో క్వెంటిన్ గ్రిఫిత్స్ ఒకరు. తర్వాత అది బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. ఈ సంస్థ ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగించే వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా కూడా ఉన్నారు. క్వెంటిన్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2007లో థాయ్‌లాండ్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత థాయ్ మహిళను వివాహం చేసుకున్నారు. కొద్దికాలానికి ఆమెతో విడిపోయారు. క్వెంటిన్ గ్రిఫిత్స్‌కు ముగ్గురు సంతానం ఉన్నారు.

Quentin Griffiths
ASOS
Quentin Griffiths death
Thailand
Pattaya
apartment fall
millionaire death

More Telugu News