Rajpal Yadav: జైళ్లలో స్మోకింగ్ జోన్లు పెట్టండి: నటుడు రాజ్‌పాల్ యాదవ్

సుమారు రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ బుధవారం విడుదలయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో బయటకు వచ్చిన ఆయన, తన స్వగ్రామమైన షాజహాన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జైలు అనుభవాలను పంచుకుంటూనే, ఓ వివాదాస్పద డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.

రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఉన్నట్లే జైళ్లలో కూడా ఖైదీల కోసం ప్రత్యేకంగా 'స్మోకింగ్ జోన్లు' ఏర్పాటు చేయాలని రాజ్‌పాల్ యాదవ్ కోరారు. "నేను పొగాకు వాడకాన్ని ప్రోత్సహించడం లేదు. సిగరెట్ మానేయడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆ అలవాటు ఉన్నవారికి జైలు లోపల చాలా ఇబ్బందిగా ఉంటోంది" అని ఆయన వివరించారు. జైళ్లను శిక్షా కేంద్రాలుగా కాకుండా, మనుషులను మార్చే సంస్కరణ కేంద్రాలుగా చూడాలని సూచించారు.

ఈ కేసులో తనకు ఎవరి సానుభూతి వద్దని, అప్పు తీర్చడానికి కొంత సమయం మాత్రమే కావాలని ఆయన కోరారు. "నేను భారత్‌లోనే పుట్టాను, నా పాస్‌పోర్ట్ మార్చుకోలేదు. నా దేశ కరెన్సీని మార్చుకోవాలని నాకు లేదు, నా సంపాదనను పెంచుకోవాలనుకుంటున్నాను" అని చమత్కరించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు నటులు సోనూసూద్, గుర్మీత్ చౌదరి తన కుటుంబాన్ని ఆదుకున్నారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు.

ఫిర్యాదుదారునికి రాజ్‌పాల్ యాదవ్ రూ. 1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో, ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేస్తూ విడుదల ఉత్తర్వులు ఇచ్చింది. తన ఇంట్లో వివాహ వేడుక ఉన్నందున, రెండు రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
Rajpal Yadav
Rajpal Yadav smoking zone
Bollywood actor
Check bounce case
Delhi High Court
Jail reforms India
Sonu Sood
Gurmeet Choudhary
Prison smoking ban
Indian Jails

More Telugu News