ట్రంప్ కు ఇరాన్ సుప్రీం వార్నింగ్

  • సంచలన వ్యాఖ్యలు చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ 
  • ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదన్న ఖమేనీ
  • ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం ఉన్నవారికైనా తీవ్ర ఎదురుదెబ్బ తగలవచ్చని హెచ్చరిక
అమెరికా - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని, భవిష్యత్తులోనూ సాధించలేదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం ఉన్నవారికైనా తీవ్ర ఎదురుదెబ్బ తగలవచ్చని హెచ్చరించారు.  

ఇరాన్‌లో పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపు అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదే సమయంలో జెనీవా వేదికగా ఇరాన్ - అమెరికాల మధ్య పరోక్ష అణు చర్చలు కొనసాగుతుండటం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. 

ఖమేనీ చేసిన వరుస ట్వీట్లలో .. తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో అది కోలుకోలేనంత దెబ్బతినే అవకాశమూ ఉంది. ఇరాన్‌ వైపు యుద్ధ నౌకలను పంపిస్తున్నామని ప్రకటిస్తున్నారు. అవి ప్రమాదకరమైనవే. అయితే, వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యమున్న ఆయుధం మరింత ప్రమాదకరం. 47 ఏళ్లుగా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను ఏమీ చేయలేకపోయామని అమెరికానే అంగీకరిస్తోంది. ఇకముందూ చేయలేరు. అణు చర్చలు జరుపుదామంటారు. కానీ చివరికి మీ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని ముందే తీర్పు చెబుతారు. చర్చల ఫలితాలను ముందుగానే నిర్ణయించడం మూర్ఖత్వమే అని ఘాటుగా వ్యాఖ్యానించారు.  

కాగా, జెనీవాలో అమెరికా - ఇరాన్‌ మధ్య జరిగిన అణు చర్చలు సుమారు మూడు గంటల్లో ముగిశాయి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్‌ హర్మూజ్ జలసంధిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. భద్రతా కారణాలతో జలసంధిని కొన్ని గంటల పాటు మూసివేసి, లైవ్ క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా సైనిక మోహరింపులు కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతంలో టెహ్రాన్‌ ఈ చర్యలు చేపట్టింది. 


More Telugu News