అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటాం: అయ్యన్నపాత్రుడు
- సాఫ్ట్ వేర్ సమస్య వల్ల అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్న అయ్యన్నపాత్రుడు
- వైసీపీ వాళ్లు గుంతలు తవ్వే రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
- సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం సరికాదని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ సమస్యే దీనికి కారణమని చెప్పారు. టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. వైసీపీ వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారని... గతంలో ఫేస్ టు ఫేస్ రాజకీయాలు ఉండేవని... ఇప్పుడు వైసీపీ వాళ్లు వెనక నుంచి గుంతలు తవ్వే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సభకు హాజరుకాని వైసీపీ సభ్యుల గురించి మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విధులను సక్రమంగా నిర్వహించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని అన్నారు. సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం సరికాదని చెప్పారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు జీతం కట్ చేస్తారని... ఆ నిబంధన ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. చాలా దేశాల్లో రీకాల్ విధానం ఉందని... మనది ప్రజాస్వామ్య దేశం కావడంతో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు.
డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని స్పీకర్ తెలిపారు. సభ్యులు అసెంబ్లీకి రావడమే కాదు... సభలో ఎన్ని గంటలు, నిమిషాలు కూర్చున్నారో కూడా ఈ వ్యవస్థ ద్వారా నమోదవుతోందని తెలిపారు.