కేసీఆర్‌ది ఏ జాతి అంటావా.. ఇదే మా జాతి: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు

  • కేసీఆర్‌ది ఏ జాతి, జాతిపిత ఎలా అవుతారని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్య
  • మాది రాణీ రుద్రమ, సమ్మక్క-సారక్కల జాతి అన్న కేటీఆర్
  • సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని ప్రశ్న
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన ఏ జాతికి జాతిపిత అని ఎద్దేవా చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రాణీ రుద్రమ, సమ్మక్క సారక్క, దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ మహాపురుషుల జాతి అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తాము ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్‌ను తూలనాడుతూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతి గురించి అడుగుతున్నారని, కానీ తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏమిటో తెలుస్తుందని అన్నారు. కానీ సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని అన్నారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్‌ది ఏ జాతి, ఎవరికి జాతిపిత అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో తెలంగాణ వాదుల జాతి, తెలంగాణ ద్రోహుల జాతులు ఉన్నాయని అన్నారు.

"సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు. నీతి తెలియదు. లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైళ్లకు వెళ్లిన వారికి, తుపాకీలకు ఎదురొడ్డి నిలబడ్డ వారికి జాతి అంటే, జాతి అస్థిత్వం అంటే ఏమిటో తెలుసు. ఉద్యమకారుల పైకి తుపాకులు తీసుకెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎలా తెలుస్తుంది. రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే ఆత్మాభిమానం అనేది ఎక్కడైనా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏమిటో, జాతి చరిత్ర అంటే ఏమిటో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇవ్వడానికే భయపడేవారికి, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు" అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

"కొందరు అడుగుతున్నారు నీది ఏ జాతి అని. ఏ జాతికి జాతి పిత అని అడుగుతున్నారు. వారికి నేను సమాధానం చెబుతున్నాను. ఏ జాతి అనే అల్పుడికి నేను చెబుతున్నాను. రాజ్యతంత్రం నడిపిన రుద్రమ జాతి మాది. జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురంభీం, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క, సారక్క, కోటల మీద జెండా ఎగురవేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న, భూస్వాముల దోపిడి మీద కొట్లాడిన దొడ్డి కొమురయ్య, బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ, సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తుర్రెబాజ్ ఖాన్, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళేజీ, నా తెలంగాణ కోటి రతనాల అన్న దాశరథి, విద్యార్థి అమరవీరుల జాతి మాది" అని కేటీఆర్ ఉద్ఘాటించారు.


More Telugu News