Shahid Afridi: బాబర్, షహీన్‌లను వెంటనే పక్కన పెట్టండి: షాహిద్ అఫ్రిది

Shahid Afridi Calls for Dropping Babar Shaheen After Loss
  • పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర ఆగ్రహం
  • బాబర్, షాహీన్, షాదాబ్‌లను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్
  • విఫలమైన సీనియర్ల స్థానంలో యువకులకు అవకాశం ఇవ్వాలన్న అఫ్రిది
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌లను తదుపరి మ్యాచ్‌లకు పక్కన పెట్టాలని డిమాండ్ చేశాడు. వరుస వైఫల్యాల తర్వాత కూడా సీనియర్లనే నమ్ముకోవడం సరికాదని, యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఒక పాకిస్థానీ న్యూస్ షోలో అఫ్రిది మాట్లాడుతూ.. "నేనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. బాబర్, షహీన్, షాదాబ్ ముగ్గురినీ బెంచ్‌కే పరిమితం చేస్తాను. వారి స్థానంలో కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాను. కీలక మ్యాచ్‌లలో సీనియర్లు రాణించనప్పుడు, వారిని జట్టులో కొనసాగించడంలో అర్థం లేదు" అని ఘాటుగా విమర్శించాడు.

ఈ మ్యాచ్‌లో పాక్ సీనియర్లు దారుణంగా విఫలమయ్యారు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో బాబర్ ఆజమ్ కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక, జట్టు ప్రధాన పేసర్ అయిన షహీన్ అఫ్రిది 2 ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకుని అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 17 పరుగులు ఇవ్వడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ నెమ్మదిగా 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అద్భుత ఇన్నింగ్స్‌తో 175 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచి, సూపర్ 8 దశకు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్‌కు ఇది 8వ విజయం కావడం గమనార్హం.
Shahid Afridi
Babar Azam
Shaheen Afridi
Shadab Khan
Pakistan Cricket
T20 World Cup
India vs Pakistan
Cricket News
Ishan Kishan
Cricket Team Selection

More Telugu News