ప్రముఖ బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతి..చంద్రబాబు, జగన్ సంతాపం

  • విజయవాడలోని స్వగృహంలో నిన్న తుదిశ్వాస విడిచిన వెంకయ్య
  • బీసీల అభ్యున్నతికి కృషి చేసిన వెంకయ్య
  • నేడు విజయవాడలో అంత్యక్రియలు
ప్రముఖ బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (93) కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  నిన్న విజయవాడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పేద కుటుంబంలో జన్మించిన వెంకయ్య కష్టపడి ఎదిగి, విజయవాడలో సుమారు మూడు దశాబ్దాల క్రితం ‘హోటల్ ఐలాపురం’ను స్థాపించి గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 

బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన వెంకయ్య.. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అలాగే శాలివాహన సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. సామాజిక సేవలోనూ ముందుండిన ఆయన.. విద్యాసంస్థలకు ఫర్నిచర్ అందించడం, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు విరాళాలు అందిస్తూ మతసామరస్యాన్ని చాటుకున్నారు. 

వెంకయ్య అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కుమారుడు రాజా గతంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పనిచేశారు. వెంకయ్య భౌతిక కాయాన్ని వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 

ఐలాపురం వెంకయ్య మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశారు. 

బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య నిరంతరం పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, అందరితో సత్సంబంధాలు కలిగిన వెంకయ్య మృతికి సంతాపం తెలియజేస్తూ  ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఐలాపురం వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
 
సీనియర్‌ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఐలాపురం వెంకయ్య ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని  పేర్కొన్నారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటని ఆయన అన్నారు. ఈ దుఃఖ సమయంలో వెంకయ్య కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు.



More Telugu News