బాలీవుడ్ నటి హిమాన్షీకి బెదిరింపులు
- బాలీవుడ్ ని షేక్ చేస్తున్న గ్యాంగ్ స్టర్లు
- తాజాగా నటి, గాయని హిమాన్షీకి బెదిరింపులు
- మొహాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
బాలీవుడ్ ప్రముఖులకు గ్యాంగ్ స్టర్ల నుంచి వరుసగా బెదిరింపులు రావడం ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సల్మాన్ ఖాన్ కు ఎప్పటి నుంచో బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా నటి, గాయకురాలు హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలంటూ దుండగుడు ఆమెను డిమాండ్ చేశాడు. ఈమెయిల్ ద్వారా వచ్చిన వాయిస్ నోట్‌లో అడిగినది ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. జీషన్ అక్తర్ పేరుతో వచ్చిన ఈ మెయిల్‌పై హిమాన్షీ పంజాబ్ లోని మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
పంజాబీ మూవీ ‘సద్దా హక్’తో నటిగా మంచి గుర్తింపు పొందిన హిమాన్షీ, ‘జోడీ బిగ్‌డే పార్టీ’, ‘నా.. నా.. నా’ వంటి ఆల్బమ్స్‌తో అలరించారు. హిందీ ‘బిగ్‌బాస్’ సీజన్ 13లో సందడి చేసిన ఆమెకు ఇప్పుడు ఈ బెదిరింపులు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, హీరో రణ్‌వీర్ సింగ్‌లకు కూడా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో వచ్చిన వాట్సప్ వాయిస్ నోట్‌లో డిమాండ్లు అంగీకరించకపోతే సిబ్బందిని హత్య చేస్తానని బెదిరించారు. ఈ వరుస బెదిరింపులు ఇండస్ట్రీలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.