Alexei Navalny: రష్యా విపక్ష నేత నావల్నీని కప్ప విషంతో చంపారా?

రష్యన్ విపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనను అత్యంత అరుదైన కప్ప విషం ఉపయోగించి హత్య చేశారని, దీని వెనుక రష్యా ప్రభుత్వ హస్తం ఉందని బ్రిటన్‌తో సహా ఐదు యూరోపియన్ దేశాలు తీవ్రంగా ఆరోపించాయి. ఈ మేరకు ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

నావల్నీ శరీరం నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా, 'ఎపిబాటిడిన్' అనే శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఆనవాళ్లు ఉన్నట్లు ఈ దేశాలు ధృవీకరించాయి. దక్షిణ అమెరికాలో కనిపించే విషపు కప్పల (పాయిజన్ డార్ట్ ఫ్రాగ్స్) చర్మం నుంచి ఈ విషాన్ని సేకరిస్తారు. రష్యాలో ఇది సహజంగా లభించదని, ఈ విషాన్ని ఉపయోగించే సామర్థ్యం, ఉద్దేశం, అవకాశం రష్యా ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయని ఆ దేశాలు స్పష్టం చేశాయి. ఈ ఆరోపణలతో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాలు రష్యాపై రసాయన ఆయుధాల నిషేధ సంస్థకు ఫిర్యాదు చేశాయి.

రష్యా తన రాజకీయ ప్రత్యర్థులను చూసి భయపడుతోందని, అందుకే ఈ ఘోరానికి పాల్పడిందని బ్రిటిష్ విదేశాంగ మంత్రి కూపర్ అన్నారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా నావల్నీ భార్య యూలియా నవల్నాయ మాట్లాడుతూ.. "రెండేళ్ల క్రితం నా భర్తను పుతిన్ చంపారని చెప్పాను. అప్పుడు అవి కేవలం మాటలు. కానీ ఇప్పుడు ఆ మాటలు శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా మారాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నావల్నీ, 2024 ఫిబ్రవరిలో ఆర్కిటిక్ జైలులో మరణించిన విషయం తెలిసిందే. అయితే, వాకింగ్ చేసిన తర్వాత అనారోగ్యంతో మరణించారని, అందులో అనుమానాస్పదమేమీ లేదని రష్యా అధికారులు అప్పట్లో ప్రకటించారు. కాగా, నావల్నీ హత్య ఆరోపణలను రష్యా మొదటి నుంచి ఖండిస్తోంది.
Alexei Navalny
Navalny
Russia
Poison dart frog
EpiBatidine
Neurotoxin
Vladimir Putin
Yulia Navalnaya
Russian opposition
Political assassination

More Telugu News