Jeffrey Epstein: ఎప్‌స్టీన్ ది ఆత్మహత్య కాదా?.. తెరపైకి కొత్త అనుమానాలు

Jeffrey Epstein Death New Documents Revive Suspicion
షార్ట్స్‌లో చూడండి
లైంగిక నేరస్థుడు, వివాదాస్పద ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ జైలులో మరణించి ఏడేళ్లు కావొస్తున్నా, ఆ మిస్టరీ మాత్రం వీడటం లేదు. తాజాగా అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన ఫైళ్లు.. 2019 ఆగస్టు 10న న్యూయార్క్ జైలు గదిలో అసలేం జరిగిందనే ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ఈ కొత్త పత్రాలు పాత అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

మైనర్ బాలికలతో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై 2019 జూలై 6న అరెస్టయిన 66 ఏళ్ల ఎప్‌స్టీన్‌ను మన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో ఉంచారు. జులై 23న తన గదిలో మెడకు నారింజ రంగు వస్త్రంతో అపస్మారక స్థితిలో కనిపించాడు. తన తోటి ఖైదీ తనను చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించాడు. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే జైలు సైకాలజిస్ట్‌తో మాట్లాడుతూ.. తనకు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం లేదని, "అలా చేసుకోవడం పిచ్చితనం" అని చెప్పాడు.

ఎప్‌స్టీన్ మరణానికి కేవలం రెండు రోజుల ముందు, ఆగస్టు 8న, అతను తన 577 మిలియన్ డాలర్ల ఆస్తిని ఒక ట్రస్టుకు బదిలీ చేస్తూ కొత్త వీలునామాపై సంతకం చేయడం గమనార్హం.

ఆగస్టు 9న రాత్రి ఎప్‌స్టీన్ గదిలో ఉండాల్సిన తోటి ఖైదీని అధికారులు మార్చారు. కానీ, అతని స్థానంలో మరొకరిని నియమించలేదు. ఆ రాత్రి విధుల్లో ఉన్న గార్డులు టోవా నోయెల్, ఘిట్టో బోన్‌హోమ్ ప్రతి 30 నిమిషాలకు ఖైదీలను తనిఖీ చేయాల్సి ఉండగా, వారు మూడు గంటల పాటు నిద్రపోయినట్లు తర్వాత తేలింది. అంతేకాకుండా, తనిఖీలు చేయకపోయినా చేసినట్లు రికార్డులు తారుమారు చేశారు.

ఆగస్టు 10 ఉదయం 6:33 గంటలకు ఎప్‌స్టీన్ తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. అధికారులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, ఎప్‌స్టీన్ సోదరుడి అభ్యర్థన మేరకు శవపరీక్షను పరిశీలించిన నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్, మెడపై ఉన్న గాయాలు ఆత్మహత్య కంటే గొంతు నులమడం వల్ల కలిగే గాయాలలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జైలులో తీవ్రమైన లోపాలు జరిగాయని అప్పటి అటార్నీ జనరల్ విలియం బార్ అంగీకరించారు. తాజాగా విడుదలైన ఫైళ్లతో ఎప్‌స్టీన్‌ది నిజంగా ఆత్మహత్యేనా? లేక పక్కా ప్రణాళికతో జరిగిన హత్యనా? అనే అనుమానాలు మళ్లీ బలపడ్డాయి.
Go Back to Shorts
Jeffrey Epstein
Epstein death
Jeffrey Epstein case
sex trafficking
jail suicide
new documents
conspiracy theories
Metropolitan Correctional Center
William Barr

More Telugu News