Baby: భద్రాద్రిలో 'బాలభీముడు'.. 5.2 కిలోల బరువుతో జన్మించిన బాబు

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సాధారణంగా నవజాత శిశువులు 2.5 నుంచి 3 కిలోల మధ్య బరువు ఉంటారు. కానీ, అందుకు భిన్నంగా ఈ బాబు భారీ బరువుతో జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన ఎం.సంధ్యారాణి రెండో కాన్పు కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. శిశువు బరువు అధికంగా ఉండటంతో ఇది క్లిష్టమైన కాన్పుగా వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ రామకృష్ణ, ఆర్‌ఎంవో డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య నిపుణులు డాక్టర్ షంషాద్ బేగం, మల్లేశ్‌ల బృందం సిజేరియన్ చేయాలని నిర్ణయించింది.

బుధవారం రాత్రి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి 5.2 కిలోల బరువున్న మగ శిశువును బయటకు తీశారు. భారీ కాయంతో పుట్టడంతో ఆ చిన్నారిని అందరూ ముద్దుగా 'బాలభీముడు' అని పిలుస్తున్నారు. గిరిజన ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతటి క్లిష్టమైన ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించిన వైద్య బృందాన్ని పలువురు అభినందిస్తున్నారు.
Baby
Bhadrachalam
Heavy weight baby
Telangana
Government Hospital
Caesarean Section
Newborn
Mulugu district
Balabheemudu

More Telugu News