కమెడియన్ కు సాయం చేయడానికి ముందుకొస్తున్న బాలీవుడ్

  • రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో రాజ్ పాల్ యాదవ్ కు జైలుశిక్ష
  • కన్నీళ్లతో జైలు అధికారుల ముందు సరెండర్ అయిన నటుడు
  • మొన్న సోనూసూద్.. ఈ రోజు మ్యూజిక్ కంపెనీ సాయం
బాలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్ కు సాయం చేసేందుకు సెలబ్రెటీలు ముందుకొస్తున్నారు. చెక్ బౌన్స్ కేసులో జైలుపాలైన రాజ్ పాల్ కు ఆర్థిక సాయం చేస్తున్నారు. మొన్న సోనూ సూద్ సాయం ప్రకటించారు. భవిష్యత్తులో తన సినిమాలో రాజ్ పాల్ యాదవ్ నటిస్తారని, అందుకుగానూ ఇప్పుడు కొంత మొత్తం ఆయనకు అందిస్తున్నానని సోనూ సూద్ చెప్పారు. ఇది సాయం కాదని, రాజ్ పాల్ యాదవ్ లోని నటుడికి గౌరవంగా ఇస్తున్న అడ్వాన్స్ అని పేర్కొన్నారు.

తాజాగా జెమ్ ట్యూన్స్ మ్యూజిక్ అధినేత ఇంద్రజీత్ సింగ్ ముందుకొచ్చారు. రాజ్ పాల్ కు రూ.1.1 కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. బాలీవుడ్ లోని మిగతా సెలబ్రెటీలు కూడా సాయం చేయాలని ఆయన కోరారు. కష్టకాలంలో ఉన్న సహచరుడికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

కాగా, 2010లో ‘అతా పతా లాపతా’ పేరుతో ఓ సినిమాను రాజ్ పాల్ యాదవ్ నిర్మించారు. అయితే, బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బోల్తా కొట్టడంతో ఆయన అప్పుల్లో మునిగిపోయారు. ఈ సినిమా కోసం మురళి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తం తిరిగి చెల్లించలేక వాయిదాలు వేస్తుండడంతో అదికాస్తా వడ్డీతో కలిపి రూ.9 కోట్లకు చేరింది.

ఈ మొత్తానికి రాజ్ పాల్ పలుమార్లు చెక్కులు జారీ చేయగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో మురళి ప్రాజెక్ట్స్ కంపెనీ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు రాజ్ పాల్ యాదవ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నెల 5న రాజ్ పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ‘నా దగ్గర డబ్బులు లేవు. మరికొంత గడువు అడిగితే కోర్టు నిరాకరించింది. నేనేం చేయను’ అంటూ రాజ్ పాల్ కన్నీళ్లతో జైలుకు వెళ్లారు.


More Telugu News