'పరీక్షా పే చర్చ'లో దేశ నిర్మాణంపై విద్యార్థులకు మోదీ పాఠాలు

  • వికసిత భారత్ గురించి విద్యార్థులు ఆలోచించడంపై ప్రధాని మోదీ హ‌ర్షం
  • అన్నం వృథా చేయకపోవడం దేశ నిర్మాణంలో భాగమేనని సూచన
  • విజయానికి క్రమశిక్షణే పునాది అని విద్యార్థులకు ప్రధాని స్పష్టీక‌ర‌ణ‌
  • 'పరీక్షా పే చర్చ'లో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ
10, 12వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే 'వికసిత భారత్' నిర్మాణం గురించి ఆలోచిస్తుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తు లక్ష్యాలపై యువత దృష్టి సారించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఇవాళ‌ 'పరీక్షా పే చర్చ 2026' రెండో ఎపిసోడ్‌లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరుతో పాటు పలు ప్రాంతాల విద్యార్థులతో ప్రధాని సంభాషించారు. 2047 నాటికి దేశాభివృద్ధికి దోహదపడాలనే విద్యార్థుల ఆసక్తిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాల పౌరులలో ఉండే క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. "ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్లేటులో ఒక్క మెతుకు కూడా వృథా చేయకుండా తినడం అలవాటు చేసుకోండి. ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ చేస్తే ఎంత ఆహారం ఆదా అవుతుందో ఊహించండి. ఇలాంటి చిన్న పనులే బలమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి పునాదులు వేస్తాయి" అని మోదీ విద్యార్థులకు వివరించారు.

అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు ఆగడం వంటి చిన్న విషయాలు కూడా వ్యక్తిగత క్రమశిక్షణకు నిదర్శనమని ప్రధాని తెలిపారు. స్ఫూర్తి, ప్రేరణ వంటివి విజయానికి కేవలం అదనపు హంగులు మాత్రమేనని, కానీ క్రమశిక్షణే దానికి అసలైన పునాది అని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదో విడతగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి 4.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు రావడం విశేషం. పరీక్షల ఒత్తిడిని తగ్గించడంతో పాటు దేశ ప్రగతిలో తమ పాత్ర గురించి విద్యార్థులను ఆలోచింపజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.


More Telugu News