భార్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కానిస్టేబుల్ సస్పెన్షన్

  • సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ కానిస్టేబుల్ కె రమేశ్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
  • చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న రమేశ్ భార్య గీతాంజలి
  • తమ ప్రత్యర్ధి ఓటమి భయంతో అధికార బలాన్ని ఉపయోగించి తన భర్తను సస్పెండ్ చేయించారన్న గీతాంజలి
  • రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వైనం
ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతూ, చేర్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన తన భార్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో రుజువు కావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, పోలీసు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు సీపీ సాధన రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. 

ఈ విషయం తెలిసిన వెంటనే రమేశ్ భార్య, చేర్యాల 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి నిరసనకు దిగారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన ఆమె అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ.. తమ ప్రత్యర్థికి ఓటమి భయం ఉండటంతో అధికార బలాన్ని ఉపయోగించి తన భర్తను సస్పెండ్ చేయించారని ఆరోపించింది. తాను నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నో ప్రలోభాలు చూపించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని, అంగీకరించకపోవడంతో చివరకు ఇలా కక్ష సాధించారని ఆమె విమర్శించారు.


More Telugu News