ఒవైసీపై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు

  • ఎప్పుడైనా ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ  మాట్లాడారా అన్న బండి సంజయ్
  • ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా లేదా చెప్పాలన్న బండి సంజయ్
  • ట్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎప్పుడైనా ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ  మాట్లాడారా అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా లేదా అనే విషయంపై దమ్ముంటే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దుకు ఎంఐఎం అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పే ధైర్యం ఉందా? అంటూ ఓవైసీకి బండి సవాల్ విసిరారు. ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరిని కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

పట్టణాల్లో అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమైందని బండి సంజయ్ పేర్కొన్నారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు నయా పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే మీ మెడలోని బంగారాన్ని కూడా కొట్టేస్తారని, పన్నుల మోతతో ప్రజల నడ్డి విరుస్తారని హెచ్చరించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థులు గుణవంతులని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ధనవంతులని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా 20 సీట్లలోపే గెలుస్తాయని బండి సంజయ్ అన్నారు. 


More Telugu News