'ఫోన్ ఇన్'... హైడ్రా కమిషనర్‌కు ఫోన్ చేసి సమస్యలు చెప్పిన ప్రజలు

  • హైడ్రా కార్యాలయంలో తొలిసారి ఫోన్ ఇన్ కార్యక్రమం
  • రంగనాథ్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన 36 మంది
  • ప్రభుత్వ స్థలాలు, నీటి వనరుల పరిరక్షణ కోసం ఓఆర్ఆర్ బయటకు విస్తరించాలని కోరిన ప్రజలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైదరాబాద్ నగర ప్రజలు ఫోన్ చేసి సమస్యలను చెప్పుకున్నారు. హైడ్రా కార్యాలయంలో ఆయన తొలిసారి 'ఫోన్ ఇన్' కార్యక్రమం చేపట్టగా, గంటలోనే 36 మంది ఫోన్ చేశారు. భూ ఆక్రమణలు, నీటి వనరులు కలుషితం కావడం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ స్థలాలు, నీటి వనరుల పరిరక్షణ కోసం హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు బయటకు కూడా విస్తరించాలని ప్రజలు కోరారు.

తమ ప్రాంతాల్లోని చెరువులో మురుగు నీరు వ‌చ్చి చేరుతోందని, దుర్గంధ‌భ‌రిత వాతావ‌ర‌ణంతో ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. గుర్ర‌పు డెక్కపెరిగి దోమ‌లతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. ఇతర చెరువుల్లాగే తమ ప్రాంతంలోని చెరువులనుకూడా అభివృద్ధి చేయాలని కోరారు.

ప్ర‌తి సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణి ఉంటుంది. కానీ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు కమిషనర్ 'ఫోన్ ఇన్' కార్యక్రమం చేపట్టారు. హైడ్రా కార్యాల‌యం వ‌ర‌కు రాలేనివారు స‌మ‌స్య‌ల‌ను ఫోనులో చెప్పుకునే అవ‌కాశం కల్పించారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 1 గంట వ‌ర‌కు 'ఫోన్ ఇన్' కార్యక్రమం జరగగా, స్వయంగా క‌మిష‌న‌ర్ రంగనాథ్ ఫిర్యాదుదారుల‌తో మాట్లాడారు. ప్రజల స‌మ‌స్యలను విని ప‌రిష్కారానికి సంబంధిత అధికారి వివ‌రాల‌ను వారికి అంద‌జేశారు.

వారం రోజుల తర్వాత కూడా సమస్య ప‌రిష్కారం కాకుంటే నేరుగా త‌న‌కు ఫోను చేయాల‌ని ఫిర్యాదుదారుల‌కు సూచించారు. సెల‌వు రోజుల్లో మిన‌హా ప్ర‌తి శ‌నివారం 040-29565750,  040-29565759 ఈ నంబ‌ర్ల‌కు ఫోను చేసి స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లాల నుంచి పలువురు ఫోన్లు చేసి తమ వద్ద కూడా చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని కాపాడాలని కోరారు. అయితే హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకేనని రంగనాథ్ స్పష్టం చేశారు. మొద‌టి విడ‌తలో 6 చెరువులను అభివృద్ధి చేశామని, త్వ‌రలో మరో 14 చెరువుల‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు.


More Telugu News