అమెరికా జట్టులో మనవాడు... ఎవరీ సాయితేజ ముక్కామల?

  • టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో అమెరికా ఢీ
  • అమెరికా జట్టులో ఆంధ్ర మూలాలున్న సాయితేజ ముక్కామల 
  • భారత్ వంటి పటిష్టమైన జట్టుతో పోటీపడి గెలవడమే లక్ష్యమన్న సాయితేజ
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియాతో పసికూన అమెరికా జట్టు తలపడుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో అమెరికా తరఫున ఆంధ్ర మూలాలున్న తెలుగు ఆటగాడు సాయితేజ ముక్కామల ఆడుతుండడం విశేషం.

ఆంధ్ర నుంచి అమెరికా వరకు.. ఓ స్ఫూర్తిదాయక ప్రయాణం
సాయితేజ 2004లో న్యూజెర్సీలో జన్మించాడు అతడి తండ్రి నాగేశ్వర్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్. 1990లలో ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై అమితమైన ఇష్టం పెంచుకున్న సాయితేజ, 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడం చూసి ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని నిశ్చయించుకున్నాడు. కొడుకులోని ప్రతిభను, పట్టుదలను గమనించిన తండ్రి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 2018లో వెరిజాన్ కంపెనీలో తన సీనియర్ మేనేజర్ ఉద్యోగాన్ని వదులుకుని, జీతంలో 80 శాతం కోతను సైతం భరించి, సాయితేజకు మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇక్కడే వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో సాయితేజకు శిక్షణ ఇప్పించడం అతని కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.

గణాంకాలే చెబుతున్నాయి సత్తా ఏంటో!
సాయితేజ కేవలం విదేశీ కోటాలో జట్టులోకి రాలేదు, తన అద్భుతమైన ప్రతిభతో స్థానం సంపాదించుకున్నాడు. ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్, తన దూకుడైన ఆటతీరుతో అమెరికా జట్టులో ముఖ్య ఆటగాడిగా మారాడు. ఇప్పటివరకు 18 టీ20 ఇన్నింగ్స్‌లలో 63.13 సగటు, 152.87 స్ట్రైక్ రేట్‌తో 947 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. 2024లో కెనడాపై ఆడిన తన తొలి టీ20 మ్యాచ్‌లోనే 27 బంతుల్లో 52 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. వన్డేల్లో సైతం రెండు సెంచరీలు సాధించి, 18 ఏళ్ల వయసులోనే అమెరికా తరఫున శతకం చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

గెలవడానికే వచ్చాం..
"మా జట్టు కేవలం ఆడటానికి రాలేదు, గెలవడానికి వచ్చింది. ఎవరికైనా గట్టి పోటీ ఇవ్వగలమని నిరూపించాలనుకుంటున్నాం" అని సాయితేజ ధీమా వ్యక్తం చేశాడు. ఈఎస్‌పీఎన్ కథనం ప్రకారం, అతను తన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా క్రికెట్టే తన ప్రాధాన్యత అని చెప్పే సాయితేజ, ఈ ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు షాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 31 బంతుల్లో 50 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నేడు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లు ఉన్న టీమిండియాను ఎదుర్కోనున్న ఈ తెలుగు తేజం ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News