పెమ్మసాని చంద్రశేఖర్ పై అంబటి రాంబాబు కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు

  • అంబటి రాంబాబుపై పెమ్మసాని ఆదేశాలతో దాడి జరిగిందన్న మౌనిక
  • బాగా చదువుకున్న వ్యక్తి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శ
  • తన తండ్రి రెడ్ బుక్ కు భయపడే వ్యక్తి కాదని వ్యాఖ్య
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు కూతురు మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. పెమ్మసాని ఆదేశాలతో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యవేక్షణలో తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని ఆమె ఆరోపించారు. దాడికి పోలీసులు కూడా సహకరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తొలిసారి ఎమ్మెల్యే అయిన గల్లా మాధవికి ఇంత అహంకారం పనికిరాదని మౌనిక చెప్పారు. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కంటే మాధవి ఎక్కువ కాదని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ బాగా చదువుకున్న వ్యక్తి అని, విదేశాల నుంచి వచ్చారని... అలాంటి వ్యక్తి ఇక్కడి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. 

తన తండ్రి అంబటి రాంబాబు రెడ్ బుక్ కు భయపడే వ్యక్తి కాదని... లా అండ్ ఆర్డర్ పై గౌరవంతోనే ఆయన క్షమాపణ చెప్పారని అన్నారు. రెండు వేల మంది చుట్టుముట్టినా, రాళ్లు రువ్వినా తన తండ్రి ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఇంటి గోడకు గునపాలు దింపుతున్నా... వ్యవస్థపై నమ్మకంతోనే ఆయన ఇంట్లో కూర్చున్నారని తెలిపారు. కానీ, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తులు వచ్చి ఆడవాళ్లపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News