రంగంలోకి శ్రీలంక.. భారత్‌తో మ్యాచ్‌పై పునరాలోచనలో పాకిస్థాన్?

  • భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై పునరాలోచించాలని పాక్‌ను కోరిన శ్రీలంక
  • మ్యాచ్ జరగకపోతే తీవ్ర ఆర్థిక నష్టాలు తప్పవన్న శ్రీలంక క్రికెట్ బోర్డు
  • శ్రీలంక అభ్యర్థనపై తమ ప్రభుత్వంతో మరోసారి సంప్రదిస్తామన్న పీసీబీ
  • సోమవారం నాటికి ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పునరాలోచనలో పడింది. ఈ మ్యాచ్‌ను నిర్వహించకపోతే తీవ్రంగా నష్టపోతామని టోర్నీ సహ ఆతిథ్య దేశమైన శ్రీలంక విజ్ఞప్తి చేయడంతో... పీసీబీ ఈ అంశాన్ని మరోసారి తమ ప్రభుత్వంతో సంప్రదించాలని భావిస్తోంది.

ఈ నెల‌ 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించొద్దని కోరుతూ శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) పీసీబీకి ఒక ఈమెయిల్ పంపింది. ఈ కీలక మ్యాచ్ రద్దయితే తమ బోర్డుకు గేట్ మనీ, హాస్పిటాలిటీ అమ్మకాల రూపంలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి నేరుగా వివరించారు. అంతేకాకుండా ఇది శ్రీలంకలో టోర్నమెంట్ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీలంకతో పాకిస్థాన్‌కు ఉన్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా వారి అభ్యర్థనను తేలిగ్గా తీసుకోలేమని పీసీబీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో లేని మొహ్సిన్ నఖ్వీ, తిరిగి వచ్చాక ఈ విషయాన్ని పాక్ ప్రధాని దృష్టికి తీసుకెళతానని షమ్మీ సిల్వాకు హామీ ఇచ్చారు. శ్రీలంక విజ్ఞప్తిని పాకిస్థాన్ తిరస్కరించిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, సోమవారం నాటికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

వాస్తవానికి పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, భారత్‌తో మ్యాచ్ ఆడకుండా నిబంధన విధించింది. దీంతో పీసీబీ ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో పాకిస్థాన్ పర్యటనలో తమ ఆటగాళ్లకు భద్రతాపరమైన ఆందోళనలు ఎదురైనప్పుడు, శ్రీలంక ప్రభుత్వం తమ జట్టును వెనక్కి పిలవకుండా టూర్‌ను పూర్తి చేసేలా ఆదేశించిందని, ఈ నేపథ్యంలో శ్రీలంక విజ్ఞప్తికి ప్రాధాన్యం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.


More Telugu News