సీఎం పదవిపై డీకే నిర్వేదం

  • ఆ సీట్లో తాను ఎప్పుడు కూర్చుంటానో కాలమే చెబుతుందని వ్యాఖ్య
  • ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడి
  • తామంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసిన డీకే శివకుమార్
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తాజాగా సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని డీకే ఆశిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఆయననే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడుతుందని అంతా భావించారు. అయితే, సీఎం సీటు కోసం పోటీపడ్డ సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపింది. డీకే, సిద్ధరామయ్యలతో చర్చలు జరిపి వివాదం రేగకుండా సర్దిచెప్పింది. అప్పట్లో సీఎం సీటును డీకే, సిద్ధూ చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకుంటారని, తొలుత సీఎం కుర్చీలో కూర్చున్న సిద్ధరామయ్య ఆ తర్వాత డీకేకు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది.

ఇటీవల ఈ గడువు ముగియడంతో సీఎం మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హైకమాండ్ మాత్రం సిద్ధూను కొనసాగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే శివకుమార్ స్పందించారు. శనివారం ఆయన మీడియా ముందు నిర్వేదం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సీట్లో తాను ఎప్పుడు కూర్చుంటానో కాలమే చెబుతుందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. సీఎం మార్పు విషయంలో తామంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డీకే స్పష్టం చేశారు.


More Telugu News