సెన్సార్ షరతులకు ఓకే.. విడుదలకు సిద్ధమవుతున్న 'జన నాయగన్'

  • విజయ్ 'జన నాయగన్' విడుదలకు తొలగిన అడ్డంకులు
  • సెన్సార్ బోర్డు షరతులకు అంగీకరించిన చిత్రయూనిట్
  • 20 నిమిషాల సన్నివేశాల తొలగింపునకు నిర్మాతల అంగీకారం
  • ఈ నెల‌ 20న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
  • రాజకీయ కక్షతోనే సినిమాను అడ్డుకుంటున్నారని విజయ్ ఆరోపణ
దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలలో నెలకొన్న ప్రతిష్ఠంభన వీడే సూచనలు కనిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డుతో నెలల తరబడి కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే దిశగా చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు అంగీకరించి, సినిమాను ఈ నెల‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న‌ విడుదల కావాల్సి ఉంది. అయితే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్న కొన్ని సన్నివేశాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారం మద్రాస్ హైకోర్టుకు చేరింది. సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ విచారణల తర్వాత కూడా విడుదలపై స్పష్టత రాకపోవడంతో నిర్మాతలు నష్టాలను నివారించేందుకు రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

తాజా నివేదికల ప్రకారం సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన సుమారు 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తొలగించడానికి, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయడానికి నిర్మాతలు అంగీకరించారు. ఇప్పటికే కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించుకుని, మార్పులు చేసిన కొత్త వెర్షన్‌ను సెన్సార్ ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు తాను రాజకీయాల్లోకి వస్తున్నందుకే తన సినిమాను కక్షపూరితంగా లక్ష్యం చేసుకున్నారని విజయ్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎలాంటి కొత్త అడ్డంకులు ఎదురుకాకుండా సెన్సార్ క్లియరెన్స్ లభిస్తే, ఈ నెల‌ 20న ‘జన నాయగన్’ థియేటర్లలోకి రావడం ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News