మళ్లీ వస్తున్న అబ్బాస్.. సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమాతోనే!

  • అమలా పాల్ కీలక పాత్రలో నటిస్తున్న వాంపైర్ థ్రిల్లర్
  • సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల కానున్న చిత్రం
  • సంజద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై పెరిగిన ఆసక్తి
ఒకప్పుడు దక్షిణాది సినిమాను తన లుక్స్‌తో, నటనతో ఉర్రూతలూగించిన హీరో అబ్బాస్ చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. దర్శకుడు సంజద్ తెరకెక్కిస్తున్న ‘హాఫ్ - ది క్రానికల్స్ ఆఫ్ టూ హాఫ్-బ్లడెడ్ వాంపైర్స్’ అనే వాంపేర్ థ్రిల్లర్ చిత్రంతో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి శుక్రవారం విడుదలైన కొత్త పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ పోస్టర్‌లో అమలా పాల్, రంజిత్ సజీవ్, ఐశ్వర్య రాజ్‌లతో పాటు అబ్బాస్ కూడా ప్రముఖంగా కనిపించారు. ‘ప్రేమ దేశం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అబ్బాస్, చాలా సంవత్సరాల విరామం తర్వాత తిరిగి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇద్ద వాంపైర్ల (రక్తపిశాచులు) కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. గుర్తింపు, మనుగడ, ప్రతీకారం వంటి అంశాలతో ఈ సినిమా కథ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అమలా పాల్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఫ్రాగ్రంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌తో పాటు పలువురు జాతీయ అవార్డు గ్రహీతలైన ఎడిటర్ మహేశ్ భువనేంద్, ప్రొడక్షన్ డిజైనర్ మోహన్‌దాస్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటం విశేషం. మిథున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు.


More Telugu News