కేసీఆర్, కేటీఆర్‌లను కాపాడుతున్నది ఆయనే: రేవంత్ రెడ్డి

  • వారిద్దరినీ కిషన్ రెడ్డి కాపాడుతున్నారని విమర్శలు
  • కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా
  • అరవింద్‌కు పరపతి ఉంటే నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎందుకు కాలేదని ప్రశ్న
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో, ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎప్పుడు అరెస్టు చేస్తారని తాను బీజేపీని ప్రశ్నిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరినీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి ఇక్కడ కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని ఎద్దేవా చేశారు.

నిజామాబాద్ జిల్లా బర్దీపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎంపీగా ధర్మపురి అరవింద్‌ను రెండుసార్లు గెలిపించినా నిజామాబాద్ ప్రాంతానికి బీజేపీ చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ మూడుసార్లు ప్రధాని అయ్యారని కానీ నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదని విమర్శించారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శమని అన్నారు.

నిజామాబాద్‌లో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అదనపు నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనలతో ఈ జిల్లాలో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు కార్పొరేటర్లుగా ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు.

తనకు కులం, మతం లేదని, అందరివాడినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా గొప్ప నాయకులను అందించిందని, మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో నిజామాబాద్ మురికికూపంగా మారిందని విమర్శించారు. మోదీ దగ్గర ధర్మపురి అరవింద్‌కు పరపతి ఉంటే నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.


More Telugu News