కాపులంటే చంద్రబాబుకు కక్ష: గుడివాడ అమర్నాథ్

  • ముద్రగడను ఎన్నో రకాలుగా వేధించారన్న గుడివాడ
  • అంబటిపై దాడి చేసి ఆయనపైనే కేసు పెట్టారని మండిపాటు
  • నాగబాబు గతంలో నాస్తికుడినని చెప్పుకున్నారని విమర్శ
కాపులంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కక్ష అని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కాపులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని అన్నారు. కాపులపై చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వంగవీటి రంగాను హత్య చేశారని, ముద్రగడను కూడా పలు రకాలుగా వేధించారని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని అమర్నాథ్ అన్నారు. అంబటి రాంబాబు మీద దాడి చేసి ఆయనపైనే తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. అంబటి రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఉదయం వెళుతున్నామని చెప్పారు. తమది సంఘీభావ యాత్ర మాత్రమేనని, రాజకీయ యాత్ర కాదని అన్నారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసు విషయంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు.

తాను నాస్తికుడినని గతంలో చెప్పుకున్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పుడు సనాతన ధర్మం అని ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తిరుమల కల్తీ లడ్డూపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతోందని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక వెల్లడించిందని... ఇప్పుడు మళ్లీ దీనిపై కమిటీ ఎందుకని ప్రశ్నించారు. లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసమే కమిటీ వేస్తున్నారా? అని నిలదీశారు. 


More Telugu News