Apple Store: హైదరాబాద్‌లో తొలి యాపిల్ స్టోర్.. ‘టీ-స్క్వేర్‌’లో ఏర్పాటుకు ప్లాన్?

Apple to Open First Hyderabad Store at T Square
షార్ట్స్‌లో చూడండి
టెక్ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. హైదరాబాద్‌లో తన తొలి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా ఉన్న నగరంలో యాపిల్ అడుగుపెట్టనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2027 ఆరంభంలో ఈ స్టోర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న యాపిల్, దీనికి సంబంధించిన ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఈ పరిణామం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచనుంది.

భారత్‌లో తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్న యాపిల్, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లో రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌పై దృష్టి సారించింది. 2027 మార్చి నాటికి నగరంలో స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనికోసం ఏడాది ముందుగానే నియామక ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రస్తుతం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ వంటి కీలక పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. త్వరలోనే ఇతర ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఈ ప్రతిష్ఠాత్మక స్టోర్‌ను హైదరాబాద్ ఐటీ హబ్ అయిన రాయదుర్గంలో నిర్మించనున్న ‘టీ-స్క్వేర్’లో ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ టవర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనిపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, టీ-స్క్వేర్‌ను 24 గంటల పాటు పనిచేసేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. యాపిల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేలా ప్రోత్సాహం అందించాలని స్పష్టమైన సూచనలు చేశారు.

టీ-స్క్వేర్‌ను కేవలం వాణిజ్య సముదాయంగా కాకుండా హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భారీ వీడియో బిల్ బోర్డులు, మెరుగైన పార్కింగ్, యుటిలిటీ జోన్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. తద్వారా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడంతో పాటు ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, యాపిల్ స్టోర్‌ను టీ-స్క్వేర్‌లో ఏర్పాటు చేయడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Go Back to Shorts
Apple Store
Apple
Apple store Hyderabad
Hyderabad Apple store
T Square Hyderabad
Retail store Hyderabad
Revant Reddy
Telangana IT hub
Apple India
Technology
Job notifications

More Telugu News