గర్భస్రావంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 30 వారాల గర్భం తొలగింపునకు అనుమతి

  • 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు 18 ఏళ్ల యువతికి సుప్రీంకోర్టు అనుమతి
  • పుట్టబోయే బిడ్డ హక్కు కంటే తల్లి పునరుత్పత్తి స్వేచ్ఛకే ప్రాధాన్యత అని స్పష్టీకరణ
  • ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని వ్యాఖ్య
  • ఈ విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
గర్భస్రావానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పుట్టబోయే బిడ్డ హక్కు కంటే తల్లి పునరుత్పత్తి స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు 30 వారాల గర్భంతో ఉన్న 18 ఏళ్ల యువతికి గర్భస్రావం చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే... 17 ఏళ్ల వయసులో ఓ యువతి తన స్నేహితుడితో సంబంధం కారణంగా గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె వయసు 18 ఏళ్లు కాగా, గర్భం 30 వారాలకు చేరుకుంది. గర్భస్రావం కోసం ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. బిడ్డను ప్రసవించి, దత్తతకు ఇచ్చేయాలని సూచించింది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ దశలో బిడ్డను కనడం వల్ల యువతి మానసికంగా, శారీరకంగా తీవ్ర వేదనకు గురవుతుందని అభిప్రాయపడింది. సామాజిక కారణాల వల్ల ఆమె తీవ్ర అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాదనను పరిగణనలోకి తీసుకుంది. గర్భస్రావం వల్ల యువతి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది.

"పుట్టబోయే బిడ్డ ప్రయోజనాలా? లేక జన్మనిచ్చే తల్లి ప్రయోజనాలా?.. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా గర్భం దాల్చమని కోర్టు బలవంతం చేయలేదు" అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. చట్టపరమైన మార్గాలు మూసుకుపోతే, మహిళలు అక్రమ మార్గాల్లో గర్భస్రావాలు చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెడుతూ, యువతి గర్భస్రావానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

భారత చట్టాల ప్రకారం 24 వారాల తర్వాత గర్భస్రావానికి కేవలం కోర్టు అనుమతి మాత్రమే ఏకైక మార్గం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News