శాంసంగ్ నుంచి బడ్జెట్ 5G ధమాకా: 6000mAh బ్యాటరీతో 'గెలాక్సీ A07' విడుదల!

  • 6 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గ్యారెంటీ
  • తక్కువ ధరలో ప్రీమియం సెక్యూరిటీ ఫీచర్లు
  • 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే హైలైట్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన పాప్యులర్ గెలాక్సీ A-సిరీస్‌ను మరింత విస్తరిస్తూ 'గెలాక్సీ A07 5G'ని గురువారం మార్కెట్లోకి తెచ్చింది. సాధారణ వినియోగదారుల నుంచి గేమింగ్ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్‌కు ఏకంగా 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ ప్రకటించడం విశేషం. ఇది ఈ విభాగంలో మరే ఇతర బ్రాండ్ అందించని గొప్ప ఫీచర్.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని 6,000mAh బ్యాటరీ. గత మోడల్‌తో పోలిస్తే ఇది 20 శాతం పెద్దది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి తోడు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, 5G నెట్‌వర్క్‌పై వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

 6.7 అంగుళాల HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియోలు చాలా స్మూత్‌గా అనిపిస్తాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. శాంసంగ్ తన ప్రీమియం ఫోన్లలో ఇచ్చే 'నాక్స్ వాల్ట్'  సెక్యూరిటీని ఇందులోనూ అందించింది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత డేటాకు అత్యంత రక్షణ లభిస్తుంది.

 భారత మార్కెట్లో గెలాక్సీ A07 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్: ధర రూ. 15,999.  6GB RAM + 128GB స్టోరేజ్: ధర రూ. 17,999. ప్రస్తుతం లాంచ్ ఆఫర్ కింద ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 1,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్‌ను రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. లైట్ వైలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో లభించే ఈ ఫోన్ శాంసంగ్ వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.


More Telugu News