ఐఐటీ బాంబే మాజీ అధికారిణికి సైబర్ సెగ: రూ. 4.62 కోట్లు దోచేసిన కేటుగాళ్లు

  • సీబీఐ అధికారి పేరిట వీడియో కాల్‌తో బెదిరింపు
  • రిటైర్మెంట్ డబ్బులు, ఎఫ్‌డీలన్నీ బదిలీ
  • ముంబై పోలీసుల చేతికి ఇద్దరు నిందితులు
దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' ముఠా మరో ఘోరానికి ఒడిగట్టింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయిన 74 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి, ఏకంగా రూ. 4.62 కోట్లు కాజేశారు. ఈ భారీ స్కామ్‌లో సహకరించిన నరేంద్ర సిన్హా, గుంజన్ దేవ్‌కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను ముంబై సైబర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

బాధితురాలికి తొలుత టెలికాం శాఖ అధికారిగా ఒకరు కాల్ చేశారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారిగా నటించిన మరో వ్యక్తి వీడియో కాల్‌లో ప్రత్యక్షమై.. ఆమె ఆధార్ కార్డు మనీలాండరింగ్‌కు వాడారని, సుమారు రూ. 6 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని భయపెట్టారు. సీబీఐ కేసు నమోదు చేసిందని, అరెస్ట్ కాకుండా ఉండాలంటే వెంటనే విచారణకు సహకరించాలని నమ్మించారు. ఈ ఒత్తిడితో ఆమె తన జీవితకాల కష్టార్జితమైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లను రద్దు చేసి మరీ అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య నిందితులు చెప్పిన ఖాతాలకు సొమ్మును బదిలీ చేశారు.

డబ్బు పోయాక మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నప్పటికీ, వారికి బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన స్థానిక వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. సిన్హా, దినేష్‌చంద్ర అనే ఈ నిందితులు కమీషన్ కోసం దొంగ బ్యాంక్ ఖాతాలు తెరిచి, బాధితుల నుంచి వచ్చే డబ్బును విత్ డ్రా చేసి అసలు ముఠాకు అందించేవారు.

 అధికారులు ఎవరూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్ చేస్తామని బెదిరించరని, 'డిజిటల్ అరెస్ట్' అనే పదం భారత చట్టాల్లో లేదని పోలీసులు మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.


More Telugu News