Air India: భారతీయ విమానాల్లో భయపెడుతున్న సాంకేతిక లోపాలు

Indian Airlines Face Rising Technical Glitches Air India Under Scrutiny
  • దేశంలోని సగం విమానాల్లో పునరావృత లోపాలు
  • భద్రత కంటే సౌకర్యాల సమస్యలే అధికం
  • నిఘా పెంచిన ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ
భారతీయ విమానయాన రంగం సాంకేతిక లోపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గడిచిన ఏడాది కాలంలో తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు ఒకే రకమైన సమస్యలతో సతమతమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో వెల్లడించింది. మొత్తం ఆరు ప్రధాన ఎయిర్‌లైన్స్‌కు చెందిన 754 విమానాలను పరిశీలించగా, అందులో 377 విమానాల్లో పదేపదే మొండి లోపాలు తలెత్తుతున్నట్లు గుర్తించారు.

టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఆ సంస్థకు చెందిన 166 విమానాల్లో ఏకంగా 137 (82 శాతం) విమానాలు ఈ జాబితాలో చేరాయి. అయితే, ఇవన్నీ విమాన భద్రతకు సంబంధించిన లోపాలు కావని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. సీట్లు, విరిగిన ట్రే టేబుల్స్, పనిచేయని వినోదపు స్క్రీన్ల వంటి 'కేటగిరీ డి' సమస్యలే అధికంగా ఉన్నాయని, వాటిని త్వరలోనే సరిదిద్దుతామని పేర్కొంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం.. ఇటీవల లండన్-బెంగళూరు విమానంలో ఫ్యూయల్ స్విచ్ సమస్య తలెత్తడంతో ఎయిర్ ఇండియా తన మొత్తం డ్రీమ్‌లైనర్ ఫ్లీట్‌ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది.

దేశంలో అత్యధిక మార్కెట్ వాటా ఉన్న ఇండిగోలో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. ఈ సంస్థకు చెందిన 405 విమానాలను ఆడిట్ చేయగా 148 విమానాల్లో పునరావృత లోపాలు బయటపడ్డాయి. అకాశ ఎయిర్, స్పైస్‌జెట్ విమానాల్లో కూడా ఇదే తరహా సాంకేతిక ఇబ్బందులు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వరుస లోపాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన నిఘా పంజాను విసిరింది. గతేడాది ఏకంగా 3,890 సర్వైలెన్స్ తనిఖీలు, 550 రాత్రిపూట ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది. విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, తనిఖీల్లో వేగం పెంచేందుకు సాంకేతిక విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భారీగా భర్తీ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 637 పోస్టులను 1,063కు పెంచడం ద్వారా భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 
Air India
Indian Aviation
Aviation Safety
DGCA
IndiGo
Flight Defects
Aircraft Maintenance
Technical Issues
Dreamliner Fleet
Fuel Switch Problem

More Telugu News