స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు: కేటీఆర్

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల కొట్టివేత రాజ్యాంగ విరుద్ధమన్న కేటీఆర్
  • సీఎం రేవంత్ ఆదేశాలతోనే స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణ
  • వీడియో సాక్ష్యాలున్నా ఆధారాలు లేవనడం హాస్యాస్పదమంటూ ట్వీట్
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను వరుసగా కొట్టివేయడం రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు అని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే స్పీకర్ నడుచుకుంటున్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

సోషల్ మీడియాలో స్పందిస్తూ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సంజయ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా, ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమని అన్నారు. ఈ చర్య ద్వారా స్పీకర్ తన పదవికే అవమానం తెస్తున్నారని, అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాస్తున్నారని మండిపడ్డారు. 

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేను విమర్శిస్తున్న తరుణంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలంటే భయం పట్టుకుందని, అందుకే ఈ నాటకాలాడుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాగ్రహం చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని అన్నారు. 

ఈ మొత్తం పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సూత్రధారి అని కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని స్పష్టం చేశారు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం వికృత రాజకీయ క్రీడ అని, ఈ చర్యలకు ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.


More Telugu News

KTR K Taraka Rama Rao Telangana politics Speaker Gaddam Prasad Kumar BRS party Congress party Revanth Reddy Party defections Jagityala MLA Sanjay Telangana municipal elections