జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం

  • నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు
  • కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని అందించిన జైలు అధికారులు
  • ప్రత్యేక పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి రాంబాబు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్లీప్ అప్నియా అనే ప్రత్యేక పరికరాన్ని జైలు అధికారులు సమకూర్చారు.  

అంబటి రాంబాబుకు స్లీప్ అప్నియా సమస్య ఉండటంతో ఆయన ప్రత్యేక పరికరం సాయంతో నిద్రిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు దీనిని ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్న వారిలో నిద్రిస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకునే స్థాయి బాగా తగ్గిపోయి, మళ్లీ కాసేపటికి పునరుద్దరణ అవుతుంది. ఆ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది. 

ఈ సమస్య ఎప్పుడు తలెత్తుతుందో ముందుగా అంచనా వేయడం కష్టం కావడంతో నిద్రకు ముందు నుంచే పరికరాన్ని అమర్చుకుని నిద్రిస్తారని వైద్యులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకే అంబటి రాంబాబుకు ఈ స్లీప్ అప్నియా పరికరాన్ని అందించినట్లు జైలు అధికారులు తెలిపారు.  


More Telugu News

Ambati Rambabu Chandrababu Naidu TDP YCP Rajahmundry Central Jail Sleep Apnea Andhra Pradesh Politics AP Politics