రాజమండ్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ సమీపంలో పెద్దపులి కలకలం

  • రాజమండ్రి దివాన్‌చెరువు పరిధిలోని ఎస్‌వీపీఎస్ ఫంక్షన్ హాల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్య ఉన్న కొబ్బరి తోటలోకి పెద్దపులి వెళ్లినట్లు గుర్తింపు
  • సీసీ కెమెరాలో రికార్డయిన పెద్దపులి కదలికలు
  • భయాందోళనలకు గురవుతున్న ప్రజలు 
  • పులిని పట్టుకునేందుకు పూణేలోని నిపుణులతో సంప్రదింపులు జరిపామన్న అధికారులు
తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటివరకు పులి పాదముద్రలే కనిపించగా, నిన్న రాత్రి తొలిసారిగా పెద్దపులి ప్రత్యక్షంగా కెమెరాల్లో చిక్కింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు పెరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 

నిన్న ఉదయం రాజమండ్రి శివారులోని గాడాల ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు పెద్దపులి వీడియోను చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాడాల ప్రాంతంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించడంతో అక్కడ బోన్‌లు ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా పెంచారు. 

రాత్రి 7 గంటలు దాటిన తర్వాత రాజమండ్రి శివారు ఆటోనగర్ వెనుక ప్రాంతంలో పెద్దపులిని చూసినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇంతలోనే పులి దివాన్‌చెరువు పరిధిలోని ఎస్‌వీపీఎస్ ఫంక్షన్ హాల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్య ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లినట్లు సమాచారం అందింది. దీంతో యంత్రాంగం మొత్తం అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. 

ఇంత వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 1న రాజమండ్రి రూరల్ పరిధిలోని తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపిన ఘటన కూడా కలకలం రేపింది. ఆ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే వారి వెనకాలే పెద్దపులి కనిపించడం ఆందోళనను మరింత పెంచింది. 

పులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తమైంది. రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ బి.ఎన్.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో డీఎఫ్‌వో ప్రభాకరరావు, ఎఫ్‌ఆర్‌వో దావీదురాజు నాయుడు, డీఆర్‌వో శ్రీనివాస్‌రావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్.శ్రీనివాసరావు తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు పూణేలోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, బుధవారం ఉదయానికి వారిని రాజమహేంద్రవరం రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నందిపాడు, రేమానుకుంట ప్రాంతాల్లోనూ పెద్దపులి కనిపించిందన్న సమాచారంతో ఉదయగిరి పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. 


More Telugu News

Rajamahendravaram Tiger Tiger Andhra Pradesh East Godavari Delhi Public School Forest Department Eluru Nandi Paadu Nellore District Puli