ప్రతి చోట గులాబీ జెండా రెపరెపలాడాలి... కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందన్న కేటీఆర్
- ఎన్నికల వ్యూహంలో సమన్వయం అత్యంత కీలకమని వెల్లడి
- నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని సూచన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజలను మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు.
వచ్చే వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఏడెనిమిది స్థానాలకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికల వ్యూహంలో సమన్వయం అత్యంత కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విజ్ఞప్తిని మన్నించి నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికీ అభ్యర్థులు స్వయంగా వెళ్లి, వారిని ప్రచారంలో భాగస్వాముల్ని చేయాలన్నారు. వారికి తగిన గౌరవం ఇచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత మున్సిపల్ సమన్వయకర్తలపై ఉందని తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కేటీఆర్ సూచించారు. చివరి ఘట్టమైన ప్రచారంపై పూర్తి దృష్టి సారించి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేసి, గెలుపు సాధించే అభ్యర్థులను ముందుకు నడిపించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. అభ్యర్థుల గెలుపుతో పాటు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సమన్వయకర్తలు తమకు కేటాయించిన మున్సిపాలిటీల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.