‘రాజకీయం చేయొద్దు.. పవన్ పేరు చెడగొట్టొద్దు’: అరవ శ్రీధర్ కేసులో మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి

  • తన సెల్‌ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయన్న మహిళా ఉద్యోగి
  • కొందరికి డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన 
  • అసలు విషయాలను పక్కనపెట్టి ఇతర అంశాలను కావాలనే లాగుతున్నారని ఆరోపణ
  • దమ్ము, ధైర్యం ఉంటే తనకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన అంశాలపైనే మాట్లాడాలన్న బాధితురాలు
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజాగా మరో సెల్ఫీ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియోలో ఆమె రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. 

తన వ్యక్తిగత అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ జనసేన పార్టీకి, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ప్రతిష్ఠకు నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆమె పేర్కొంది. రాజకీయం చేసి పవన్ కల్యాణ్ పేరు చెడగొట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే తన పరువు, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, ఈ ప్రచారం ఆగకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని ఆమె స్పష్టం చేసింది. తన సెల్‌ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని వ్యాఖ్యానించింది. తనకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన విషయాలను పక్కనపెట్టి ఇతర అంశాలను కావాలనే లాగుతున్నారని ఆరోపించింది. 

తాను పరారీలో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తన వద్ద ఒకే ఒక సెల్‌ఫోన్ ఉందని, అది ఆన్‌లోనే ఉందని, యూపీఐ లావాదేవీలు కూడా కొనసాగుతున్నాయని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరికి డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, ఈ విషయం తనకు పలువురు ఫోన్ చేసి చెబుతున్నారని తెలిపింది. ఈ వ్యవహారంలో తాతంశెట్టి నాగేంద్రపై కూడా ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించింది. రాజకీయ ప్రయోజనాల కోసం జనసేనకు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. పవన్ కల్యాణ్ నీతిగా జీవించే వ్యక్తి అని, బ్రోకర్ రాజకీయాల వల్ల ఆయనకు ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. 

దమ్ము, ధైర్యం ఉంటే తనకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన అంశాలపైనే మాట్లాడాలని ఆమె సవాల్ విసిరింది. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, నిరూపించలేకపోతే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. ఒకటిన్నర సంవత్సరాలుగా తమ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు తమకే తెలుసని, అందుకే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 



More Telugu News

Arava Sridhar Arava Sridhar case Janasena Pawan Kalyan Railway Koduru Andhra Pradesh Politics Tatham Shetty Nagendra Political Controversy Woman Employee Cell Phone Video