మాకు ప్రాణహాని ఉంది.. భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్

  • ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని పిటిషన్‌లో ఆరోపణ
  • దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారని ఆయ‌న‌ కుమారుడి ఆవేదన
  • తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నపం
  • లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరపనున్న హైకోర్టు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తన భద్రత విషయమై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ, తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఆయన కుమారుడు జోగి రోహిత్ కుమార్ కూడా హైకోర్టులో మరో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.

తమ ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదని రోహిత్ తన పిటిషన్‌లో ఆరోపించారు. గుంపులుగా వచ్చిన వ్యక్తులు దాడి చేస్తుంటే, అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకుండా కేవలం ప్రేక్షకపాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆధారాలుగా కోర్టుకు సమర్పిస్తున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. ఈ రెండు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం కాసేపట్లో విచారణ జ‌ర‌ప‌నుంది.


More Telugu News